కార్తీకపురాణం మూడవ అధ్యాయము

 ఓం శ్రీగురుభ్యోనమః

ఓం శ్రీ సత్య పదానంద ప్రభూజీ స్వామినే నమః

      "కార్తీకపురాణం మూడవ అధ్యాయము"

కార్తీక మాస  స్నాన మహిమ:-

జనక మహరాజా ! కార్తిక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై ,దానము చేసిన వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము 

"శివ సాన్నిధ్యమును" చేరుదురు. 


కానీ, కొంత మంది  ఆశాశ్వతములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి,కుక్క,పిల్లులుగా జన్మింతురు.కనీసము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజునైననూ స్నాన, దాన, జపతపాదులు, చేయక పోవుట వలన  అనేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. 


దీనిని గురుంచి నాకు తెలిసిన ఒక ఇతిహాసం వినిపించెదను.సపరి వారముగా శ్రద్దగా వినుడు.


బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట:-

ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, 

తపఃశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు"తత్వనిష్టుడు" అను బ్రాహ్మణుడు ఉండెను


ఒక నాడా  బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై  అఖండ గోదావరికి బయలు దేరెను. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్షంబు  పైన భయంకర ముఖములతోను,దీర్ఘకేశములతోను బలిష్టంబులైన కోరలతోను,నల్లని బానపొట్టల తోను, చూచు వారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ,ఆ దారిన బ్రోవు బాటసారులను బెదిరించి వారినిభక్షించుచూ, ఆ ప్రాంతమంతా భయకంపితము చేయు చుండిరి. 


తీర్ధ యాత్రకై  బయలు దేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు 

ఆ వృక్షము చెంతకు చేరు సరికి యథాప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంప బోవు సమయమున,బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటించుచు ' ప్రభో ! ఆర్తత్రాణ పరాయణ! 

ఆ నాధ రక్షక !ఆపదలో నున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పడుచున్న మహాసాద్వి ద్రౌపదిని,బాలుడగు ప్రహ్లాదున్ని రక్షించిన విధముగానే,ఈ పిశాచములు బారి నుండి నన్ను రక్షించు తండ్రీ! యని వేడుకొనగా, 


ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి ' మహానుభావా!మీ నోటి నుండి వచ్చిన "శ్రీమన్నారాయణ"స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు' యని బ్రాహ్మణుని ప్రాదేయపడిరి. 


వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' 

ఓయీ!మీరెవరు?ఎందులకు మీకీ రాక్షస రూపాలు కలిగెను.మీ వృత్తాంతము తెలుపుడు' యని పలుకగా వారు' 


విప్ర పుంగవా!మీరు పూజ్యులు, ధర్మాత్ములు , 

వ్రత నిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు'అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈవిధంగా చెప్పసాగెను. 


నాది ద్రావిడ దేశం,బ్రాహ్మణుడను.నేను మహా పండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని పశువునై ప్రవర్తించితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకోనుచు, 

దుర్వ్యనాలతో,భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమాన పరచుచూ,లుబ్దుడనై 

లోక కంటకుడిగా నుంటిని.


ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలు దేరి,తిరుగుప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను.వచ్చినపండితుని నేను దూషించి,కొట్టి అతనికి వద్ద నున్న ధనము, 

వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచితిని 


అందులకా విప్రునకు కోపము వచ్చి 

' ఓరి నీచుడా ! అన్యాయముగ డబ్బు కూడా బెట్టినది చాలక,మంచి చెడ్డలు తెలియక, 

తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశములలో నుందువు'గాక!యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. 


బ్రహ్మాస్త్రమునైన తప్పించుకో వచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించ లేము గదా! 


కాన నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్ధించితిని.అందుల కాతడు దయ దలచి' ఓయీ! గోదావరి క్షేత్ర మందొక వటవృక్షము గలదు.నీ వందు నివసించుచూ, బ్రాహ్మణుల ఆశీర్వచనముల వలన పునర్జన్మ నొందుదువు గాక' యని వెడలి పోయెను. 


ఆనతి నుండి నేనీ రాక్షస స్వరూపమున 

నరభక్షణము చేయుచుంటిని.కాన ఓ విప్రోత్తమా

నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తనవృత్తాంతమును జెప్పెను


ఇక రెండవ రాక్షసుడు,ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడనే. 

నేను నీచుల సహవాసము చేసి తల్లి తండ్రులను బాధించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే  బార్య బిడ్డలతో పంచ భక్ష్య పరమాన్నములతో భుజించు చుండెడి వాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగును, నా బంధువులను కూడా హింసించి వారి ధన మపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన, నాకీ రాక్షససత్వము కలిగెను. 

నన్నీ పాపపంకిలము నుండి ఉద్దరింపుము' అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడు కొనెను.


మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియ జేసెను.మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. 

నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. 

స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగు చుండెడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనను అర్పించక,భక్తులు గొని తెచ్చిన సంభారములను  

నా ఉంపుడు గత్తెకు అంద జేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణాంతరము యీ రూపము ధరించితిని,కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు' మని ప్రార్ధించెను.


ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి 

'ఓ బ్రహ్మరాక్షసులరా!భయ పడకుడు. 

మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను.నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును' యని, 

వారి నోదార్చి తనతో గొని పోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పించి తనే స్వయముగా గోదావరిలో స్నాన మాచరించి స్నాన పుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దార పోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. 


కార్తిక మాసములో గోదావరి స్నాన మాచరించినచో హరి,హరాదులు సంతృప్తి నొంది స్నానము చేసిన వారికీ సకలైశ్వర్యములు ప్రసాదించుతురు. 


అందువలన, ఎంత ప్రయత్నం చేసైనా సరే, తప్పకుండా కార్తీక స్నానాలు ఆచరించాలి.


ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మూడవ రోజు పారాయణం సమాప్తం.  

     "ఓం నమః శివాయ హర హర మహాదేవ"

                   🙏జైగురుదేవ్🙏

Comments

Popular posts from this blog

కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం